09/06/2026
ఆసుపత్రి అపాయింట్‌మెంట్ మిస్ అయిన మహిళకు ₹35,000 పరిహారం – KSRTCపై వినియోగదారుల కమిషన్ ఆదేశం.
నిర్దేశిత సమయానికి ముందుగానే బస్సు బయలుదేరడంతో ఒక మహిళ ఆసుపత్రి అపాయింట్‌మెంట్‌ను కోల్పోయిన ఘటనలో, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)పై పథనంతిట్ట వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది.
ఈ ఘటనలో బాధిత మహిళకు ₹25,000 పరిహారం, ₹10,000 వ్యయాలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అదనంగా, ఆమె చెల్లించిన బస్సు టికెట్ ఛార్జీ ₹146ను 9% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని పేర్కొంది.
కమిషన్ అధ్యక్షుడు జార్జ్ బేబీ, సభ్యుడు నిషాద్ థంకప్పన్‌లతో కూడిన ధర్మాసనం, రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుడు బస్సును కోల్పోయేలా షెడ్యూల్ సమయానికి ముందే బస్సు బయలుదేరడం స్పష్టమైన “సేవలో లోపం” (Deficiency in Service) అని పేర్కొంది.
కేసు వివరాలు:
2024 ఆగస్టు 24న కట్టకాడ నుండి ఎర్నాకుళంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు మహిళ KSRTC సూపర్ ఫాస్ట్ బస్సులో రిజర్వేషన్ చేసుకుంది. తిరువల్లా నుండి ఉదయం 8 గంటలకు బస్సు బయలుదేరాల్సి ఉంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసుపత్రిలో వైద్య సంప్రదింపుల కోసం ఆమె ఇప్పటికే ₹500 ఫీజు చెల్లించింది.
ఆమె ఉదయం 7:30 గంటలకు బస్ స్టాప్‌కు చేరుకుని 8:10 గంటల వరకు వేచి చూసింది. బస్సు రాకపోవడంతో సిబ్బందిని సంప్రదించగా, బస్సు ఇప్పటికే తిరువల్లా దాటి కొట్టాయం చేరిందని చెప్పినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. మరో బస్సులో వెళ్లాలని సూచించినట్లు తెలిపింది.
దీంతో ఆమె ఆసుపత్రి అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని, చెల్లించిన ఫీజు నష్టపోయిందని, మళ్లీ మరోరోజు సెలవు తీసుకుని వెళ్లాల్సి రావడంతో ఆర్థిక నష్టం, మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంది.
KSRTC వాదనలు:
ఈ కేసులో బస్సు కండక్టర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాల్సిందని KSRTC వాదించింది. ప్రయాణికురాలి వివరాలతో కూడిన రిజర్వేషన్ చార్ట్‌ను కండక్టర్‌కు అందజేశామని తెలిపింది. అయితే కండక్టర్ స్థాయిలో లోపం జరిగి ఉండవచ్చని అంగీకరించింది.
కమిషన్ అభిప్రాయం:
బస్సు సిబ్బంది తిరువల్లా డిపోలో బస్సును నిర్దేశిత సమయానికి అందుబాటులో ఉంచకపోవడం విధి నిర్వహణలో వైఫల్యమని కమిషన్ పేర్కొంది.
“ఉదయం 8 గంటలకు బస్సు అందుబాటులో ఉంటుందని ప్రకటించి టికెట్ విక్రయించినప్పటికీ, ఆ సేవను అందించడంలో విఫలమయ్యారు. ఇది తప్పుదారి పట్టించే హామీ. మధ్యంతర స్టేషన్ల నుండి షెడ్యూల్ సమయానికి ముందుగా బస్సులు బయలుదేరకూడదు” అని కమిషన్ స్పష్టం చేసింది.
వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం సేవలో లోపం అనగా సేవ నాణ్యత, స్వభావం లేదా నిర్వహణలో ఏదైనా తప్పు, లోపం లేదా అసమర్థత అని పేర్కొంటూ, ఈ కేసులో సేవలో లోపం నిరూపితమైందని కమిషన్ తేల్చింది.
– నున్నా శబరినాథ్
అడ్వకేట్, హైదరాబాద్