15/07/2026
130వ సవరణ బిల్లు: అరెస్టును శిక్షగా మార్చే ప్రమాదకర చట్టం!
భారత సంవిధానం మరియు న్యాయవ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలను బలహీనపరచే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంవిధాన (130వ సవరణ) బిల్లు, 2025 తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ బిల్లు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించగల నేరంలో 30 రోజుల నిర్బంధం ఉంటే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను స్వయంచాలకంగా తొలగించేలా చేస్తుంది.
ప్రశ్న… అరెస్టే శిక్షగా మారుతుందా? భారత న్యాయవ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. “కోర్టు దోషిగా తేల్చే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషే.” అయితే ఈ బిల్లు అమల్లోకి వస్తే… కోర్టు తీర్పు రాకముందే… అరెస్ట్ రాజకీయ శిక్షగా మారే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారు.
రాజకీయ కక్షలకు అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రంగా వినిపిస్తున్న ఆందోళన.
ప్రతిపక్షాల వాదన ఏమిటంటే… దేశంలో ఇప్పటికే CBI, NIA, ED వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై రాజకీయ వివాదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలను రాజకీయ వ్యతిరేకులను లక్ష్యం చేసుకుని ఉపయోగించడం జరుగుతోందన్న ఆరోపణలు సాధారణమవుతున్న నేపథ్యంలో, ఈ బిల్లు ఆ అన్యాయానికి రాజ్యాంగ స్థాయి మెరుగులు పూయడంగా కనిపిస్తోంది.
ఈ బిల్లు ఎందుకు ప్రమాదకరం?
• నిర్దోషిత్వ సూత్రానికి గుండెపోటు: అరెస్టు మాత్రమే ఆధారంగా పదవి తొలగింపు అనేది శిక్షకు సమానం. కోర్టు తీర్పు రాకముందే ఇలాంటి చర్య తీసుకోవడం రాజ్యాంగం ఆర్టికల్ 21 (జీవన స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ)ను ఉల్లంఘిస్తుంది.
• రాజకీయ ప్రతీకార ఆయుధం: ప్రభుత్వ వ్యతిరేక నాయకులపై కేసులు నమోదు చేసి, 30 రోజుల నిర్బంధం ద్వారా వారిని రాజకీయంగా అంతం చేయవచ్చు. ఇది ఫెడరల్ స్ట్రక్చర్‌ను బలహీనపరుస్తుంది.
• దుర్వినియోగ సాధ్యత: ఇప్పటికే దర్యాప్తు సంస్థలపై ఉన్న ఆరోపణలు ఈ బిల్లుతో మరింత పెరిగే అవకాశం ఉంది.
న్యాయవాదిగా నా స్పష్టమైన అభిప్రాయం ఏమంటే — ఈ సవరణ రాజకీయాలను శుద్ధి చేయడానికి కాకుండా, వ్యతిరేక గొంతుకలను అణచివేయడానికి ఉపయోగపడుతుంది. సంవిధాన స్ఫూర్తికి విరుద్ధమైన ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ తిరస్కరించాలి.
– ఆర్. మణి రత్నం, న్యాయవాది
B.A., LL.B., LL.M (Juris), DCCA
Osmania University